Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో దొంగతనానికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు మైనర్లు ఉండగా పోలీసులు వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. సమాచారం మేరకు.. ఈ నెల ఒకటి ఉచిత దర్శనం క్యూలైన్ నుంచి ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మైనర్లు గర్భాలయంలో రత్నగర్భ గణపతి వద్ద ఉన్న క్లాత్ హుండీని బ్లేడ్ సహాయంతో కోసి అందులో నుంచి డబ్బులు తీశారు. సీసీ కెమెరాల్లో కనిపించగా.. కంట్రోల్ రూమ్‌లోని సిబ్బందిని అప్రమత్తమై ఓ బాలుడిని పట్టుకున్నారు. మైనర్ బాలుడి వద్ద నుంచి సుమారు రూ.10,150 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పది రోజుల నుంచి ఇద్దరు మైనర్లు ఉచిత దర్శనం క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి వెళ్లి వచ్చినట్లు సమాచారం. అయితే, ఈవో ఆదేశాల మేరకు దేవస్థానం సీఎస్‌వో ఫిర్యాదు మేరకు శ్రీశైలం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి గోప్యంగా విచారణ జరిపి ఇద్దరు మైనర్లు.. మరో ఇద్దరు మేజర్లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఓ మహిళ, ఇద్దరు మైనర్లు ఉన్నారు. మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించారు. దర్జాగా ఆలయంలోకి వచ్చి హుండీ నుంచి డబ్బులు తీస్తున్నా అక్కడున్న సిబ్బంది ఎవరూ గుర్తించకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనకు ఆలయ సీనియర్ అసిస్టెంట్‌ని బాధ్యుడిగా చేస్తూ.. ఆయనను సస్పెండ్ చేసేందుకు ఈవో శ్రీనివాసరావు సిద్ధం చేసినట్లు సమాచారం.