Srisailam Dam | శ్రీశైలం ప్రాజెక్టు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు డ్యామ్ గేట్లన్నీ మూసివేశారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి జలాశయానికి వరద తగ్గుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 1,54,454 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయం నుంచి 85,851 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 20వేల క్యూసెక్కులు విడుదలవుతున్నది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు నీరు దిగువకు వెళ్తున్నది.
కుడి గట్టు నుంచి సైతం మరో 30వేలకు క్యూసెక్కులకుపైగానే నీరు సాగర్ వైపు వెళ్తున్నది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 882.10 అడుగులు ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 199.73 టీఎంసీలుగా ఉన్నది. ఇటీవల భారీ వర్షాలు కురువడంతో ఎగువ నుంచి కృష్ణానదికి భారీగా వరద పెరిగింది. దాంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా పరీవాహకంలో అన్ని ప్రాజెక్టులు నిండడంతో గేట్లను సైతం ఎత్తివేశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పడుతుండడంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద తగ్గుముఖం పట్టింది.