రాజమండ్రి : కల్తీ కల్లు సేవించిన ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. వీరంతా గిరిజనులే కావడం విశేషం. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలోని లోదిడ్డిలో జరిగింది. దీంతో లోదొడ్డి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నది. కల్లు శాంపిల్స్ సేకరించిన అధికారులు.. వాటిని పరిశీలన నిమిత్తం ప్రభుత్వ ల్యాబ్‌కు పంపించారు.
రాజవొమ్మంగి మండలం పరిధిలోని లోదిడ్డి గ్రామంలో కల్లు తాగిన ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రాంతంలో జీడి కల్లు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. ఏజెన్సీలోని గిరిజనులు నిత్యం ఈ జీడి కల్లును సేవిస్తుంటారు. బుధవారం ఉదయం కూడా ఇలాగే జీడి కల్లు తాగిన పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని చికిత్స నిమిత్తం గెడ్డంగిలో పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృత్యువాత పడ్డాడు. దాంతో మిగిలిన వ్యక్తులను కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా .. మార్గమధ్యంలోనే నలుగురు వ్యక్తులు చనిపోయారు.
ఐదుగురు గిరిజనులు మృతిచెందడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పోలీసులు, ఎక్సైజ్ అధికారులు లోదిడ్డి గ్రామానికి చేరుకుని విచారణ నిర్వహించారు. జీడి కల్లు శాంపిల్స్‌ను వైద్యులు సేకరించి ప్రభుత్వ ల్యాబ్‌కు తరలించారు. ఏజెన్సీ ప్రాంతంలో జీడి కల్లును గిరిజనులే సేకరించి నిల్వ ఉంచుతారు. అయితే, ఎంతకాలంగా నిల్వ ఉంచడం వల్ల పులిసి పోయి ప్రాణాపాయంలోకి తీసుకెళ్లిందనే దానిపై అధికారులు విచారిస్తున్నారు. ఉదయం పనులకు వెళ్లడానికి ముందే జీడి కల్లును తాగినట్లుగా తెలుస్తున్నది.