అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో రోడ్డును తవ్వేసిన ఘటన కలకలం రేపింది. రోడ్డును తవ్విన రైతుపై తాసిల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాను ఆ భూమిని కొనుగోలు చేసినందునే తవ్వినట్లు రైతు చెప్తున్నాడు. అమరావతి రాజధాని కోసం ప్రభుత్వం సేకరించిన భూమిని ఎవరు అమ్మారనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
తాడేపల్లి మండలం పెనుమాక వద్ద రాజధాని నగరం కోసం వేసిన ఓ రోడ్డు తవ్వకానికి గురైంది. స్థానిక రైతు ఒకరు ఈ రోడ్డును తవ్వినట్లుగా తెలుస్తున్నది. శంకుస్థాపన కోసం ఈ రోడ్డును గతంలో ఏర్పాటు చేశారు. అయితే, పెనుమాకకు చెందిన రైతు గోవిందరెడ్డి ఈ రోడ్డును తవ్వి ఆ మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలించినట్లు అధికారులకు సమాచారం అందింది. రోడ్డును తవ్విన ప్రదేశాన్ని తన సిబ్బందితో కలిసి ఆర్ఐ ప్రశాంతి పరిశీలించారు. రోడ్డు తవ్వినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రైతు గోవిందరెడ్డిని కూడా విచారించి వివరణ నోట్ చేసుకున్నారు. ఆర్ఐ ప్రశాంతి నివేదిక ఆధారంగా రైతు గోవిందరెడ్డిపై తాసిల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, తాను ఆ భూమిని కొనుగోలు చేశానని, చదును చేసేందుకు తవ్వి కంకర చిప్స్‌ను తమ గ్రామావసరాలకు తరలించినట్లు వెల్లడించారు. అమరావతి రాజధాని నగరం ఏర్పాటు నిమిత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేల ఎకరాల భూమిని సేకరించింది. దీనికి సంబంధించి ఎన్నో కేసులు కోర్టుల్లో కూడా నడిచాయి. భూములు ఇచ్చిన వారికి న్యాయం చేసేందుకు ప్రత్యేక కమిటీని కూడా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలాఉండగా, శంకుస్థాపన కోసం ఏర్పాటుచేసిన ప్రాంతంలోనే రోడ్డు తవ్వడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాజధాని భూములను ఎవరు విక్రయించారనేది, ఈ భూములను గోవిందరెడ్డి తెలిసే కొనుగోలు చేశారా..? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.