అమరావతి : ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కువ మండలంలో పర్యటన సందర్భంగా నకిలీ ఐపీఎస్ (Fake IPS officer ) పాల్గొనడం చర్చాంశనీయంగా మారింది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిని సారించి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
విజయనగరం జిల్లా గరివిడికి చెందిన మాజీ సైనికుడు బలివాడ సూర్యప్రకాష్ నకిలీ ఐపీఎస్ అధికారి అవతారం ఎత్తి పవన్ కల్యాణ్ పర్యటనలో బందోబస్తులో పాల్గొన్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita) స్పందించారు. వై కేటగిరి భద్రతలో ఉన్న పవన్ కల్యాణ్‌కు భద్రత లోపంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు.
పవన్ కల్యాణ్ భద్రతలో జరుగుతున్న లోపాలపై దర్యాప్తు చేసి , కఠిన చర్యలు తీసుకుంటామని అనిత తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. కాగా హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు నకిలీ ఐపీఎస్‌ను పట్టుకోవడానికి గాలింపు చర్యలు మొదలు పెట్టారు.