Balineni | ఒంగోలు రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. మొదటి నుంచి ఉప్పు నిప్పులా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంటుంది. మొన్నటివరకు వీరిద్దరూ ప్రత్యర్థులుగా ఉండగా.. బాలినేని ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో నడిచేందుకు సిద్ధమవ్వడం ఇప్పుడు దామచర్లకు ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో జనసేనలో బాలినేని చేరికను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఏ పార్టీలో చేరినప్పటికీ బాలినేనిని వదిలే ప్రసక్తే లేదని బాహాటంగా హెచ్చరిస్తున్నారు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి వంటి అవినీతిపరుడు ఏ పార్టీలోకి వెళ్లినా వదిలేది లేదని దామచర్ల జనార్దన్ అన్నారు. బాలినేనితో పాటు ఆయన కొడుకు ప్రణీత్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు తనపై, టీడీపీ శ్రేణులపై బాలినేని అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. అసలు బాలినేనిని పవన్ కల్యాణ్ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కూడా బాలినేనిని రక్షించలేరని హెచ్చరించారు. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
కాగా, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ (గురువారం) భారీ బల ప్రదర్శనతో జనసేనలో చేరాలని భావించారు. కానీ ఒంగోలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బల ప్రదర్శనకు జనసేన అధిష్ఠానం నిరాకరించింది. నిరాడంబరంగానే పార్టీలో చేరాలని స్పష్టం చేసింది. దీంతో ఎలాంటి ఆర్భాటం లేకుండానే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య ఇతర నాయకులు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన కండువా కప్పుకోనున్నారు.