అమరావతి : తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నాయకులు పేర్ని నాని( Perni Nani) , కొడాలి నాని (Kodali Nani) ఆరోపించారు. రాజకీయ లబ్ది పొందాలనుకుంటే ఆ వేంకటేశ్వరస్వామి చంద్రబాబును క్షమించడని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా కొడాలి నాని తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
గత టీడీపీ , వైసీపీ పాలనలో తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో కల్తీ ఉందని నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే శ్రీవారి ప్రతిష్టను మంటగలిపేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ నెయ్యిని ఎప్పుడూ తిరుమలలో వాడలేదని స్పష్టం చేశారు.
రాజకీయ లబ్దికోసమే జంతువుల కొవ్వు ప్రస్తావన తీసుకొచ్చారని వారు విమర్శించారు. జంతువుల నూనె కలిసిందని ఎవరూ నివేదిక ఇవ్వలేదని తెలిపారు. తిరుమలలో చంద్రబాబు ఎన్నిసార్లు తలనీలాలు సమర్పించారని, ఎన్నిసార్లు కాలినడకన స్వామివారిని దర్శించుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అసలు వేంకటేశ్వరాస్వామి భక్తుడు కాదని ఆరోపించారు. టీడీపీ నాయకులు బరితెగించి వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.