Srisailam Temple | శ్రీశైలం : శ్రీగిరి క్షేత్రలో ఈ నెల 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాలకు దేవస్థానం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. వేడుకలకు వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలోనే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఈవో శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. దేవస్థాన రక్షిత మంచినీటి సరఫరా, నిర్మాణంలో ఉన్న మినీ కల్యాణకట్ట, పార్కింగ్ ప్రదేశాలను వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచినీటి సరఫరాపై దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. శుద్ధ జలాలను అందించేందుకు శాస్త్రీయ ప్రమాణాలను పాటించాలని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు.
ఆ తర్వాత గణేశ సదనం ఎదుట నిర్మిస్తున్న మినీ కల్యాణ కట్ట పనులను పరిశీలించి.. వారంరోజుల్లోగా పనులు పూర్తి కావాలన్నారు. అనంతరం పలు పార్కింగ్ స్థలాలను పరిశీలించిన ఆయన.. అక్కడ సైతం మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. అవసరమైన లైటింగ్ సదుపాయం కల్పించాలన్నారు. పార్కింగ్ స్థలాల వద్ద అదనపు ప్రసాదం విక్రయాల కౌంటర్లు ఏర్పాటు చేయాలని.. దాంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈవో వెంట ఎగ్జిక్యూటివ్ మురళీకృష్ణ, ఎం నరసింహారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చంద్రశేఖర్శాస్త్రి, సహాయ ఇంజినీర్ రాజేశ్వరరావు ఉన్నారు.