Allu Arun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించిన విషయం తెలిసిందే. అధికారి వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి ఆయన మద్దతు పలికారు. అనుమతి లేకుండా జనసమీకరణ జరిపారంటూ అభ్యర్థి రవితో పాటు అల్లు అర్జున్‌పై సైతం కేసు నమోదైంది. అయితే, ఈ వ్యవహారం తాజాగా పోలీసులకు చుట్టుకున్నది. నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఎన్నికల నియమావళిని అమలు చేయడంలో విఫలమయ్యారని, ఆయనపై అభియోగాలను నమోదు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
అలాగే, ఎస్డీపీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపై డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిపించాలని డీజీపీకి ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, అల్లు అర్జున్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి స్నేహితులు. తన స్నేహితుడికి మద్దతు పలికేందుకు పుష్ప స్టార్ తన భార్యతో కలిసి శనివారం నంద్యాలలో పర్యటించారు. నంద్యాల శివారులో అల్లు అర్జున్‌కు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పెద్ద ఎత్తున కార్లు, బైక్‌లతో ర్యాలీ తీశారు. అయితే, పర్యటనకు ముందస్తు అనుమతి లేదని.. అయినా భారీగా బందోబస్తు కల్పించారంటూ ఎన్నికల కమిషన్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ వ్యవహారంపై ఈసీ చర్యలకు ఆదేశించింది.