Kadapa Mayor | కడప నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత సురేశ్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డిప్యూటీ మేయర్‌గా ఉన్న ముంతాజ్ బేగంను తాత్కాలిక మేయర్‌గా నియమించింది. అయితే ఐదు నెలల్లో పాలకవర్గం పదవీకాలం గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి తీర్మానాలు తప్పనిసరి కావడంతో మేయర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు మేయర్ పదవి కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇదిలా ఉంటే ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్‌పై సురేశ్‌బాబు ఏపీ హైకోర్టులో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన వేసిన పిటిషన్‌పై ఈ నెల 9వ తేదీన విచారణ జరగనుంది.