Duvvada Srinivas | వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టెక్కలిలోని దువ్వాడ ఇంటికి శనివారం మధ్యాహ్నం వాణి, ఆమె కూతురు హైంధవి వచ్చారు. వారిని లోపలికి అనుమతించకపోవడంతో ఇంటి ముందే బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దువ్వాడ ఫ్యామిలీపై వాణి నిప్పులు చెరిగారు.
తన గురించి దువ్వాడ శ్రీనివాస్ నీచంగా మాట్లాడటం సబబేనా అని వాణి ప్రశ్నించారు. ఎలాంటి వాళ్లను జగన్ పార్టీలో ఎలా ఉంచుకుంటారని ప్రశ్నించారు. దువ్వాడను వెంటనే ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయాలని, పార్టీ నుంచి బహిష్కరించాలని జగనన్న కోరుతున్నా అని అన్నారు. దీనిపై వైసీపీ కచ్చితంగా ఆలోచించాలని.. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
దువ్వాడ శ్రీను తల్లి లీలావతి వ్యాఖ్యలపైనా వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. లీలావతి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేం ఎవరితో మందు తాగామో ఆమే చెప్పాలని డిమాండ్ చేశారు. తన గురించి నీచంగా మాట్లాడటం సబబేనా అని ప్రశ్నించారు. తన డబ్బులతోనే దువ్వాడ ఎదిగారని ఆమె అన్నారు. తన ఆస్తులను తనకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. లీలావతిని దువ్వాడ అమ్మా అని పిలవరని.. తల్లీకొడుకుకు అస్సలు పడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధురి టెక్కలిలో ఎలా తిరుగుతుందో చూస్తామని హెచ్చరించారు. దువ్వాడ వల్ల తమ కుటుంబం, సొసైటీ ఇబ్బంది పడుతుందని అన్నారు. అందుకే దువ్వాడను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.లీలావతి అబద్ధాలు చెబుతున్నారని హైంధవి కూడా ఆరోపించారు.
తన కొడుకు దువ్వాడ శ్రీనివాస్‌ను వాణి 30 ఏళ్లుగా వేధిస్తోందని లీలావతి ఆరోపించారు. వాణికి మందు పిచ్చి, డబ్బు పిచ్చి, రాజకీయ పిచ్చి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కాంక్షతో తన కొడుకును హింసిస్తోందని, ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తన కొడుకు పడుతున్న బాధలు చూసి విడాకులు ఇవ్వమని ఎప్పట్నుంచో చెబుతున్నానని తెలిపారు. ప్రేమ వివాహం కాబట్టి వాణితోనే శ్రీను కొనసాగాడని చెప్పారు. కానీ తన మనమరాళ్లు కూడా శ్రీనును తిట్టడం చూస్తుంటే బాధ కలుగుతోందని వాపోయారు. దువ్వాడ శ్రీను ఉంటున్న ఇల్లు తన చిన్న కొడుకు శ్రీధర్ కట్టించాడని తెలిపారు. ఆ ఇంటితో శ్రీనుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా వాణికి చెందదని అన్నారు.