తిరుపతి : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 31న ‘దీపావళి(Deepavali) ఆస్థానాన్ని’ నిర్వహిస్తున్నట్లు టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు. దీపావళి నాడు ఉదయం 7 నుంచి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుందన్నారు.
ఆస్థానంలో భాగంగా మలయప్పస్వామి (Malayappa Swamy) దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారని వివరించారు. సేనాధిపతి అయిన విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారని తెలిపారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుందన్నారు.
సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు. దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబరు 31న తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తామని వివరించారు.