Kethireddy | సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీలో వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులు పార్టీని వీడగా.. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారారు. మాజీ ఎమ్మెల్యే ఉదయభాను కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
తాను పార్టీ మారడం లేదని కేతిరెడ్డి స్పష్టం చేశారు. 35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నామని, ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తానని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెంటే ఉంటానని క్లారిటీ ఇచ్చారు.
ఎల్లవేళలా జగన్ కుటుంబానికి తోడుగా ఉంటామని కేతిరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ కుటుంబసభ్యులే పార్టీ నుంచి బయటకు వెళ్లారని, కానీ తమ ప్రయాణం మాత్రం జగన్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, నమ్ముకున్న వారి కోసమే రాజకీయాలు చేస్తున్నానని అన్నారు.