AP News | చెరువు భూములు కబ్జా చేశారని తన తమ్ముడి భార్యకు నోటీసులు ఇవ్వడంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు. తనకు ఇచ్చిన నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందని ఆయన ఆరోపించారు. చెరువు భూములు కబ్జా చేశారని వచ్చిన ఆరోపణలపైనే గతంలోనే కోర్టుకు వెళ్లానని తెలిపారు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నవారు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ విషయంలో కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తానని హెచ్చరించారు. తన భూముల విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నానని తెలిపారు.
అసలేం జరిగింది?
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ధర్మవరం రెవెన్యూ గ్రామ పరిధిలోని 904, 905, 908, 909 సర్వే నంబర్లలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడు (వెంకటకృష్ణారెడ్డి) భార్య వసుమతి పేరుతో రైతుల నుంచి 25 ఎకరాలు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంది. అయితే వీటికి ఆనుకుని 908, 909, 910, 616-1 సర్వే నంబర్లలో ఉన్న చెరువు స్థలం 20 ఎకరాల వరకు ఆక్రమించి కలిపేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 45 ఎకరాల్లో పలు రకాల పండ్ల తోటలు సాగుచేశారు. ఇందులోనే లగ్జరీ ఫామ్‌హౌజ్, రేసింగ్ ట్రాక్ నిర్మించారు. దీంతో 20 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేశారనే ఆరోపణలపై వసుమతికి నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాలను ఖాళీ చేయకపోతే అందులో ఉన్న నిర్మాణాలు, చెట్లు, పంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
2023 ఏప్రిల్‌లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ధర్మవరం చెరువు కబ్జాపై ఆయన ఆరోపణలు చేశారు. వాటిని నిరూపించుకోవాలంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి సవాలు విసిరారు. ఆ మరుసటి రోజే చెరువు కబ్జాకు సంబంధించిన ఆధారాలను నారా లోకేశ్ విడుదల చేశారు. అధికారంలోకి రాగానే కేతిరెడ్డి కబ్జాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.
Kethireddy Venkatramireddy2
Kethireddy Venkatramireddy2