Cyclone Alert | ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 510 కి.మీ, చెన్నైకి 890 కి.మీ, విశాఖపట్నంకి 920 కి.మీ, కాకినాడకి 920 కి.మీ, గోపాల్పూర్ కి 1000 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
మచిలీపట్నం – కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుపాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సోమ, మంగళవారాల్లో తుపాను ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ముందస్తు సహయక చర్యల కోసం 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లో సిద్ధంగా ఉంచమన్నారు తెలిపారు.
సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడనున్నందున నదులు, సముద్ర తీరాల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్ కార్యకలాపాలు బుధవారం వరకు నిలిపివేయాలని,అలాగే బీచ్‌లకు పర్యాటకుల ప్రవేశం కూడా నిషేధించాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. జిల్లాలకు తుపాను ఎస్వోపీ అమలుపై సూచనలు జారీ చేశారు. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సోమ,మంగళవారాల్లో భారీ నుంచి అతిబారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.