Cyclone Montha |మొంథా తీవ్ర తుపాన్ నేపథ్యంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కూటమి నాయకులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.మొంథా తుపాన్ నేపథ్యంలో కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
కూటమి కార్యకర్తలు అందరూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని చంద్రబాబు నాయుడు సూచించారు. అవసరమైతే కేంద్ర సాయం కూడా కోరతామని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడి నష్టాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇవాళ రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. రియల్ టైమ్‌లోనే ప్రజల మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపించి అలర్ట్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆకస్మిక వరదల దృష్ట్యా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించామని తెలిపారు.
మొంథా తుపాన్ ప్రభావంతో ఇప్పటికే తీర ప్రాంత జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా ఆనందపురం-తగరపువలస జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డును వరదనీరు ముంచెత్తి పొంగడంతో నీరు రోడ్డుపైకి వచ్చింది. ఆనందపురం మండలం వెల్లంకి, తగరపువలస ఫ్లైఓవర్, అవంతి కాలేజీ ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డులోకి కూడా వర్షపునీరు చేరింది. విశాఖ జిల్లా శ్రీకృష్ణాపురం ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాజువాక నుంచి యారాడ వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి.
ఇదిలా ఉంటే.. పశ్చిమ బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్ వేగంగా కదులుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 10కి.మీ. వేగంతో దూసుకొస్తోంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 110 కి.మీ., కాకినాడకు 190కి.మీ., విశాఖపట్నానికి 280 కి.మీ. దూరంలో తుపాన్ కేంద్రీకృతమైంది. తీవ్ర తుపాన్ తీరం దగ్గరికి వచ్చే కొద్దీ ప్రభావం పెరుగుతోంది. దీంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. రేపు ఉదయం వరకు గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు తెలంగాణలోని కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో, ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాల్లో ఫ్లాష్ ఫడ్స్ సంభవించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుపాన్ నేపథ్యంలో కాకినాడ పోర్టుకు పదో నంబర్ ప్రమాద హెచ్చరికను విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం జారీ చేసింది.