గుంటూరు: ఇన్స్టాగ్రామ్ పరిచయం కాస్తా ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొంపముంచింది. ఫ్రెండ్ కదా అని నమ్మితే.. ఖరీదైన గిఫ్ట్ పేరుతో సైబర్ చీటర్లు ఆ యువతిని నిండా ముంచారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సైబర్ కేటుగాళ్ల చేతిలో సదరు యువతి దాదాపు రూ.6 లక్షల మేర పోగొట్టుకున్నదని, ఇలాంటి మెసేజ్‌లను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
వివరాల్లోకెళితే.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ యువతి.. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వైద్యుడి నుంచి వచ్చిన రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది. గత కొన్నిరోజులుగా ఇద్దరు చాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తన తల్లి పుట్టినరోజు ఉన్నదని చెప్పడంతో.. సదరు వైద్యుడు మైక్ ఆంథోని ఖరీదైన బహుమతి పంపుతానని మాటిచ్చాడు. ఆ యువతి ఇంటి అడ్రస్ తీసుకున్న సదరు మోసగాడు.. మరుసటి రోజు గిఫ్ట్ కొరియర్లో పంపినట్లు చెప్పాడు.
తర్వాత గిఫ్ట్ ప్యాక్ వచ్చిందని, కస్టమ్స్ చెల్లించి తీసుకోవాలని ఓ వ్యక్తి సూచించాడు. ఆ గిఫ్ట్ ప్యాక్ పొందాలంటే రూ.45 వేలు చెల్లిస్తే చాలని చెప్పడంతో.. ఆ మొత్తాన్ని ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ పెట్టింది. అలా అడిగినప్పుడల్లా పంపుతూ మొత్తం రూ.6 లక్షల వరకు మోసగాళ్ల అకౌంట్లో జమచేసింది. అయినప్పటికీ బహుమతి రాకపోవడంతో మైక్ ఆంథోనిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉన్నది. దాంతో తాను మోసపోయానని భావించి సదరు యువతి నల్లపాడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, బహుమతుల పేరిట నమ్మించే మోసగాళ్ల నుంచి ఫోన్ రాగానే పోలీసులను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.