తిరుమల : కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వీఐపీలు (VIPs), భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశమున్నందున అందుకు అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా నిన్న స్వామివారిని 62,495 మంది భక్తులు దర్శించుకోగా 19,298 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి భక్తులు రెండు కంపార్టుమెంట్లలో (Compartments) వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు వివరించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.80 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
అమరావతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్భించిన ఈవో
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం వద్ద ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ ఈవో జె.శ్యామల రావు సందర్శించారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి నిలిచిపోయిన అభివృద్ధి పనులను, నిర్మాణానికి సంబంధించిన వివరాలను, ఆలయంలో రోజువారి జరుగుతున్న కైంకర్యాలను, అన్నదాన వివరాలను ఈవోకు అధికారులు వివరించారు.
టీటీడీ సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ , అన్నదానానికి అవసరమైన భవనాలు, భక్తులు వేచియుండేందుకు హాల్, స్వామివారి వాహనాల కోసం వాహనమండపం, ఆహ్లాదకరంగా గార్డెనింగ్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.