కడప: ఇప్పటికే క్రాప్ హాలీడేను ప్రకటించిన కోనసీమ జిల్లాల రైతులను కడప రైతులు అనుసరిస్తున్నారు. వారి మాదిరిగానే ప్రభుత్వంపై యుద్ధభేరి ప్రకటించారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్న కడప రైతులు కూడా క్రాప్ హాలీడే ప్రకటించారు. గత ఏడాది కూడా వరి పంటకు విరామం ఇచ్చిన సీఎం సొంత జిల్లా రైతులు.. ఈ ఏడాది కూడా వరి వేసేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. వరి రైతుల బాటను పట్టేందుకు అటు ఆక్వా రైతులు కూడా సిద్ధమయ్యారు.
గిట్టుబాటు ధరతోపాటు వివిధ సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల క్రాప్ హాలీడ్ ప్రకటిస్తున్నట్లు కోనసీమ జిల్లా పరిధిలోని 12 మండలాల రైతులు వెల్లడించారు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు రైతుల సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు. పలువురు రైతులకు బకాయిలు చెల్లించారు. అయినప్పటికీ కోనసీమ జిల్లా రైతులు పట్టువీడటం లేదు. కాగా, వీరి మార్గాన్నే అనుసరించాలని కడప జిల్లా వరి రైతులు నిర్ణయించారు. గత ఏడాది క్రాప్ హాలీడే ప్రకటించిన కడప వరి రైతులు.. ఈ ఏడాది కూడా పంటలు వేయమంటున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా నుంచే ఈ ప్రకటన రావడంతో అధికారులు కలవరానికి గురవుతున్నారు. గత రెండేండ్లుగా వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఇంతవరకు ఆదుకోలేదని, గిట్టుబాటు ధర కల్పించడం లేదని కడప జిల్లా వరి రైతులు ఆరోపిస్తున్నారు.
కాగా, ఆక్వా రైతులు కూడా క్రాప్ హాలీడే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఆక్వా ఎగుమతిదారుడు, ఫీడ్ ఉత్పత్తిదారుడు సిండికేటుగా మారి రొయ్యల రేటు తగ్గిస్తున్నారని వారు మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఫిష్ ట్రేడర్స్ అసోసియేషన్ భవనంలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆక్వా పరిశ్రమపై ఆధారపడి రాష్ట్రంలో ప్రత్యక్షంగా 20 లక్షల మంది, పరోక్షంగా మరో 20 లక్షల మంది జీవిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలీడే ప్రకటిస్తామని వీరు హెచ్చరిస్తున్నారు. ఆగస్ట్ ఒకటి నుంచి క్రాప్ హాలీడే ప్రకటించేందుకు సిద్ధమని పశ్చిమ, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల ఆక్వా రైతులు స్పష్టం చేశారు.