నెల్లూరు : జిల్లా కేంద్రంలో ఓ జంట దారుణ హత్యకు గురైంది. దంపతులను హత్య చేసిన అనంతరం దుండగులు ఇంట్లోని నగలు, నగదును అపహరించుకుపోయారు. ఈ సంఘటన నెల్లూరు పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో విషాదాన్ని నింపింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ దవాఖానకు తరలించిన పోలీసులు.. క్లూస్ టీమ్‌లను రప్పించి విచారణ ప్రారంభించారు. కాలనీకి సమీపంలోని ఏఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్, మినీ బైపాస్ రోడ్, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు పట్టణంలోని అశోక్ నగర్లో నివసించే వాసిరెడ్డి కృష్ణారావు, సునీత దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి.. ఇంటి గుమ్మం వద్ద కృష్ణారావు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి తన సోదరుడికి సమాచారమిచ్చాడు. వారి సమాచారం మేరకు నెల్లూరు టౌన్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరి చూడగా కృష్ణారావు భార్య సునీత బెడ్రూమ్లో శవమై పడి ఉన్నది. ఇద్దరి శరీరాలపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం దుండగులు ఇంట్లోని విలువైన బంగారు నగలు, నగదును ఎత్తుకుపోయారు.
ప్రాథమిక నివేదికల ప్రకారం ఇది దోపిడీ కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నేరం జరిగిన స్థలాన్ని పరిశీలించి శనివారం రాత్రి హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత సునీతను ఇంట్లో చంపిన దుండగులు.. అనంతరం ప్రధాన ద్వారం వద్ద కృష్ణారావును కత్తితో పొడిచి చంపినట్లుగా తెలుస్తున్నది. తమను గుర్తించకుండా ఉండేందుకే దుండగులు ఇద్దరినీ హత్య చేసి ఉంటారని లేదా ఇలా చేయడం వారు ఊహించి ఉండరని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం దుండగులు వెనుక తలుపు నుంచి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. కృష్ణారావు విద్యుత్ శాఖ సమీపంలో శ్రీరామా క్యాంటీన్‌ను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముందస్తు ప్రణాళికతోనే హత్య జరిగిందా? దంపతులకు తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.