Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనకు 50 ఏండ్ల నుంచి తెలుసని.. ఆయనకు ఉన్నంత లక్ ఎవరికీ లేదని ఆయన తెలిపారు. చంద్రబాబు చాలా అదృష్టవంతుడని అన్నారు. దేశ రాజకీయాలు ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్నాయని అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం నాడు చింతా మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో చంద్రబాబు మాట్లాడితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడం సాధ్యమవుతుందని అభిప్రాయడం వ్యక్తం చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను రక్షించేది కేవలం చంద్రబాబు మాత్రమే అని చింతా మోహన్ అన్నారు. ఉక్కు కార్మిక సంఘాల నేతలు ఈ విషయం తెలుసుకోవాలని చెప్పారు. అందుకే ఉక్కు కార్మికులు వైజాగ్లో దీక్షలు చేయడం మాని.. చంద్రబాబు ఇంటి ముందు దీక్షలు చేయాలని సూచించారు.
తిరుమల లడ్డూపై ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా చింతా మోహన్ స్పందించారు. పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం మంచిది కాదని సూచించారు. శ్రీవారి లడ్డూలో కల్తీ జరగలేదని.. నెయ్యి స్థానంలో పామాయిల్, వంట నూనె కలిసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు మాట్లాడకూడదని అన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 100 రోజులు అయినా ఒక్క హామీని కూడా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. తిరుపతి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలనూ చింతా మోహన్ తప్పుబట్టారు. మాజీ సీఎం జగన్ను రాజకీయాల్లో దెబ్బతీయాలంటే.. బెయిల్ రద్దయ్యేలా చూడాలని సలహా ఇచ్చారు. అంతేతప్ప దేవాలయాలను వివాదాల్లోకి తీసుకురావద్దని సూచించారు.