అమరావతి : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీపై ప్రభుత్వానికి నిరసనలు తెలుపుతుండగా మరోవైపు తమ సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆర్టీసీకి చెందిన ఉద్యోగులు, కార్మికులు రేపటి నుంచి ఆందోళనలకు పిలుపునిచ్చారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఈనెల 6న అర్ధరాత్రి నుంచి నిర్వహిస్తున్న సమ్మెకు ఆర్టీసీలోని పలు సంఘాలు మద్దతును ప్రకటించాయి.
దీంట్లో భాగంగానే ఈరోజు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. సమ్మెతో సహా భవిష్యత్ పోరాట కార్యాచరణ అమలుపై నిర్ణయం తీసుకున్నారు. .రేపు, ఎల్లుండి ఆర్టీసీ ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించాలని, అన్ని డిపోల పరిధిలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధుల్లో పాల్గొనాలని, భోజన విరామంలో డిపోలో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం అనంతరం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని , ఉద్యోగుల ఆందోళనలకు గల కారణాలను సభ్యులకు వివరించాలని సూచించారు.