అమరావతి : హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల (Super Six promises) అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, వాటి అమలును ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు.
వైసీపీ పాలనలో పదివేల రూపాయాలకు వచ్చే ఇసుక నేడు రూ. 15 వేలకు లభిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం సినరేజ్ వసూలు చేయకపోయినా టన్ను ఇసుక రేటు తగ్గలేదని అన్నారు. ట్రాక్టర్‌తో ఉచిత ఇసుకను వైసీపీ ప్రభుత్వం కూడా ఇచ్చిందని, టీడీపీ ప్రభుత్వం కొత్తగా ఏమీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మద్యం ధరలు తగ్గించలేదని ఆరోపించారు.
చంద్రబాబు పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని పేర్కొన్నారు. టీడీపీ నాయకుల కుమ్ములాటల వల్ల గుర్ల గ్రామంలో మంచి నీటిపై పర్యవేక్షణ లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డయేరియా సోకి 10 మంది ప్రాణాలు కోల్పోయ్యారని ఆరోపించారు. డయేరియాతో చనిపోయిన బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, తదితరులు పాల్గొన్నారు.