గుంటూరు: హత్యకు గురైన శ్రీలక్ష్మి కుటుంబానికి ఏపీ సర్కార్ అండగా నిలిచింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆమె కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం అందజేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శ్రీలక్ష్మి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.
గుంటూరు జిల్లా తుంపూడి గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి ఈ ఏడాది ఏప్రిల్ 27న దారుణహత్యకు గురైంది. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఈ మేరకు సీఎం సహాయనిధి నుంచి రూ.10 లక్షలను కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు.
శ్రీలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం ఇంటి స్థలంతోపాటు ఇల్లు కూడా ఇచ్చింది. ఈ మేరకు కలెక్టరేట్లో వారికి స్థలం, ఇంటికి సంబంధించిన పత్రాలను అందజేశారు. డిపాజిట్ మొత్తాన్ని ఆమె పిల్లల పేరిట ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రెండు డిపాజిట్లుగా విభజించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజకుమారి, డీఆర్ఓ చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.