అమరావతి : ఏపీలో త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో అధికార కూటమి, విపక్ష పార్టీలు తలమునకలవుతున్నాయి. వైసీపీ తరుఫున విజయనగరం స్థానిక సంస్థల అభ్యర్థిగా (YCP MLC Candidate) చిన అప్పల నాయుడును పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.
పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan) అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో చిన అప్పల నాయుడు పేరును ఖరారు చేశారు. టీడీపీ ఆవిర్భావం సమయంలో ఎన్టీ రామారావు పిలుపుమేరకు టీడీపీలో చేరిన చిన అప్పలనాయుడు బొబ్బిలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మూడుసార్లు గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ప్రొటెం స్పీకర్గా 175 మంది ఎమ్మెల్యేలచే ఆయన ప్రమాణం చేయించారు.
విజయనగరం జిల్లాల్లో స్థానిక సంస్థలకు 753 మంది ప్రతినిధులకుగాను వైసీపీకి 592 మంది ప్రతినిధులున్నారు. ఈ స్థానాన్ని కూడా వైసీపీ ఖాతాలో పడే విధంగా వైసీపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు.