హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూర్ మహమ్మద్ షేక్(40) పాకిస్తాన్ ఉగ్రసంస్థలతో లింకులు కలిగి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఎన్ఐఏ, కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి పక్కా సమాచారంతో ధర్మవరం పోలీసులు అప్రమత్తమై నూర్ మహమ్మద్‌పై నిఘా ఉంచారు. నిందితుడు జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడని, అందులోని నంబర్లకు వాట్సాప్ చాటింగ్, కాల్స్ చేసినట్టు నిఘాసంస్థలు గుర్తించాయి. ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా వ్యాఖ్యలు చేసినట్టు ధ్రువీకరించారు. శుక్రవారం రాత్రి నిందితుడి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన పోలీసులు ఆ ఇంట్లో సోదాలు చేసి.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
నిందితుడికి సాయంత్రం ధర్మవరం ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కదిరిలో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా.. న్యాయమూర్తి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని పోలీసులు కడప జైలుకు తరలించారు. నూర్ మహమ్మద్ నిషేధిత ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో ఉన్నట్టు గుర్తించినట్టు డీఎస్పీ నర్సింగప్ప తెలిపారు. కొన్ని సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత నిందితుడు పాకిస్తాన్‌లోని ఉగ్ర సంస్థలతో ఎక్కువ సార్లు ఫోన్ మాట్లాడినట్టు సమాచారం. నూర్ మహమ్మద్‌ను భార్య కొన్నిరోజుల క్రితం వదిలేయడంతో, తాడిపత్రిలో మరో మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు గుర్తించారు.