కర్నూలు జిల్లాలో చిరుత కలకలం రేపుతున్నది. రామకొండ కొండల సమీపంలో చిరుతను చూసినట్లు స్థానికులు చెప్తున్నారు. దేవినేని కొండల్లో పులిని చూసిన గొర్రెల కాపరులు విషయాన్ని స్థానిక అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పులి బారి నుంచి తమను కాపాడాలంటూ రామకొండ సహా పరిసర గ్రామాల ప్రజలు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.
రామకొండ సమీపంలో సంచరిస్తున్న చిరుతపలి కొన్ని మేకలను చంపి తిన్నట్లుగా స్థానికులు గుర్తించారు. దాంతో గొర్రెల కాపరులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దేవినేని కొండల్లో చిరుతపులిని చూసినట్లు గొర్రెల కాపరులు చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా చిరుతపులి పాదముద్రలను గుర్తించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. అటవీ ప్రాంతంలోకి గొర్రెలు, మేకలను మేతకు తీసుకెళ్లకుండా చూడాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు. కల్యాణదుర్గంలోనూ చిరుత సంచరిస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా ఆవులు చనిపోయి కనిపించడంతో చిరుత పనిగా స్థానికులు భావిస్తున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. దాంతో అటవీ శాఖ అధికారులు కల్యాణదుర్గంలో మకాం వేసి చిరుత జాడ కోసం గాలింపు చేపడుతున్నారు. గేదెలు, ఆవులను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. రెండేండ్ల క్రితం పత్తికొండ ప్రాంతంలో.. గత జనవరి నెలలో ఆళ్లగడ్డ ప్రాంతంలో కూడా చిరుత కనిపించి అక్కడి వారిని భయపెట్టింది. అయితే, అలా కండ్ల ముందు మెరిసి మాయమవుతున్న పులులు ఎక్కడికి వెళ్తున్నాయి..? వాటి జాడలేంటి..? అనే విషయాలపై ఏపీ అటవీ శాఖ అధికారులు దృష్టిపెట్టిన దాఖలాలు లేకపోవడం విచారకరం.