అమరావతి : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టయి విడుదలైన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra babu) శనివారం పరామర్శించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఫోన్ చేసి అరెస్టుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
పుష్ప-2 సినిమా (Puspa-2 ) బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌కు ఫ్యామిలీతో వచ్చిన బన్నీని చూసేందుకు వచ్చిన అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి సినిమా థియేటర్ నిర్వాహకులను అరెస్టు చేయగా నిన్న అల్లు అర్జున్ను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు (Jail) పంపించారు.
శనివారం బెయిల్‌పై విడుదలై ఇంటికి వచ్చిన సందర్భంగా బన్నీని పరామర్శించేందుకు సినీ సెలబ్రిటీలు అల్లు నివాసానికి చేరుకున్నారు. ప్రముఖ దర్శకుడు కె రాఘవేందర్రావు, దర్శకుడు సుకుమార్, త్రివిక్రమ్, నిర్మాత దిల్ రాజ్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్ నిర్మాతలు, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, బన్ని వాసు, నిర్మాత ఎస్కేఎన్, రానా దంపతులు, పుష్ప టీమ్ సభ్యులు అల్లు అర్జున్ పరామర్శించారు. తెలుగుదేశం నేత, శాసన సభ్యుడు గంటా శ్రీనివాస రావు, చిరంజీవి భార్య, మేనత్త సురేఖ తదితరులు అర్జున్ను కలిసిన వారిలో ఉన్నారు.