అమరావతి : రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం కల్పించడానికి కూటమి ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను ( Swarnandhra Vision Document ) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) విజయవాడలో శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కరణల (Reforms) ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమని అన్నారు. విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర దశ, దిశను మారుస్తుందని అన్నారు. డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని అభివర్ణించారు. వైసీపీ (YCP) పాలనలో రాష్ట్రంలో ఊహించిన దానికంటే ఎక్కువగా విధ్వంసం జరిగిందని ఆరోపించారు.
పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే ప్రజల పట్ల మాకున్న బాధ్యతకు నిదర్శనమని వెల్లడించారు. తెలగుజాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని అన్నారు.
ప్రస్తుతం 3వేల డాలర్లకంటే తక్కువగా తలసరి ఆదాయం ఉందని, 2047 నాటికి 42 వేల డాలర్లకు తలసరి ఆదాయం పెరగాలన్నది తమ లక్ష్యమని వివరించారు. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారని తెలిపారు.