హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. చంద్రబాబుతోపాటు జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్, లోకేశ్ సహా మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రవాణా మంత్రి నితిన్ గడరీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, సినీ నటులు చిరంజీవి, రజినీకాంత్, రామ్‌చరణ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఎల్జేపీ చీఫ్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, మాజీ గవర్నర్ తమిళిసై తదితరులు హాజరయ్యారు. మంత్రుల ప్రమాణం కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపి, సాయంత్రం అమరావతికి చేరుకోనున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు.. నవ్యాంధ్రప్రదేశ్‌కు సీఎం కావడం ఇది రెండోసారి. చంద్రబాబు మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి చోటు దకింది. గతంలో పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన ఏడుగురు మొదటిసారి మంత్రులయ్యారు. మంత్రుల్లో జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి స్థానం కల్పించారు. కాగా మంత్రిపదవులు ఆశించిన పలువురు సీనియర్లకు నిరాశే మిగిలింది. వీరిలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అయ్యన్నపాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, యరపతినేని, బొండా ఉమ, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ తదితరులు ఉన్నారు.
ఏపీ సీఎం ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయిన కొద్ది నిమిషాల్లోనే ఏపీ చీఫ్ సెక్రటరి నీరబ్‌కుమార్ సీఎం ముఖ్యకార్యదర్శిగా రవిచంద్రను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం 4.41గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు. వెంటనే ఆయన ఐదు ఫైళ్లపై సంతకం చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి హోదాలో మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సైన్సెస్‌పై నాలుగో సంతకం, అన్న క్యాంటీన్లపై ఐదో సంతకం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఫైళ్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.