అమరావతి : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళలో (Maha Kumbh Mela ) జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన కుటుంబాలకు ఆ దేవుడు మనోధైర్యం కల్పించాలని కోరారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రయాగ్రాజ్లోని (Prayagraj) మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానంలో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమానికి చేరుకున్నారు.
ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 15 మంది మృతిచెందారు. మరో 50 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. ప్రయాగ్రాజ్లోని స్వరూపరాణి ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు.