పశ్చిమ గోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు భేషుగ్గా ఉన్నాయని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ నారాయణస్వామి మెచ్చుకున్నారు. వీటి ద్వారా గ్రామ ప్రజలందరికీ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండటం వల్ల అభివృద్ధి త్వరగా సాధ్యమవుతుందన్నారు. భీమవరం మండలం కొమరాడలోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం, సచివాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా టీకా కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకుంటున్న గ్రామస్తులను పలకరించి ఎన్ని డోస్‌లు తీసుకున్నారు? ఎవరికి వ్యాక్సిన్ ఇస్తున్నారు? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన కొమరాడ గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. గ్రామ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా కానిస్టేబుల్, వ్యవసాయ శాఖ సిబ్బంది విధులపై ఆరా తీశారు. వాలంటీర్ల సేవలు, వారి వేతనాల గురించి అడిగి తెలుసుకున్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారని ఏ నారాయణస్వామి కొనియాడారు.
ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థ మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ సంక్షేమ కార్యక్రమం వీరి ద్వారా గ్రామాల్లోని ప్రతి ఇంటికి తెలుస్తుండటం నిజంగా అభినందనీయమన్నారు. కేంద్ర మంత్రి నారాయణస్వామి వెంట బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ, పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ శాఖ అధ్యక్షుడు నరీనా తాతాజీ తదితరులు ఉన్నారు.