AP News | గన్నవరంలో పెంపుడు పిల్లి మృతి ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పిల్లిని చంపేశారని పక్కింటివాళ్లపై ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది. పక్కింటి కుటుంబం మాత్రం పిల్లిని చంపాల్సిన అవసరం మాకేంటి అని వాదిస్తున్నారు. దీంతో అసలు పిల్లి ఎలా చనిపోయిందో తేల్చలేక పోలీసులు సతమతమవుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరంలోని వెంకటనరసింహాపురం కాలనీకి చెందిన షేక్ చానా కుమార్తె ఆశాకు గత మార్చిలో తన మేనల్లుడు పర్షియన్ జాతికి చెందిన ఓ పిల్లిని బహుమతిగా ఇచ్చాడు. అప్పట్నుంచి దాన్ని ఆ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ పిల్లి పాలు తాగకపోవడంతో.. దానికి ప్రత్యేక ఆహారం కూడా పెడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ( ఈ నెల 28వ తేదీ) నుంచి పిల్లి కనిపించడం లేదు. పిల్లి ఆచూకీ కోసం తమ ఇంటి చుట్టుపక్కల వెతికారు. ఆ పిల్లికి పక్కింటి ఆవరణలోని చెట్ల కింద పడుకోవడం అలవాటు కావడంతో అక్కడికేమైనా వెళ్లి ఉంటుందేమోనని వాళ్ల ఇంటి పరిసరాల్లోనూ గాలించారు. ఈ క్రమంలో రోడ్డుపై తమ పెంపుడు పిల్లి శవమై కనిపించింది. దీంతో తమ పిల్లి మరణానికి పక్కింటి కుమారినే కారణమని చానా భావించింది. అంతేకాదు ఇదే విషయమై గన్నవరం పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేసింది. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్ 429 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తమకు పిల్లిని చంపేంత అవసరం ఏముందని కుమారి ప్రశ్నించింది. తమ పరిసరాల్లో కుక్కలు ఎక్కువగా ఉంటాయని.. అవే ఏమైనా చేసి ఉండొచ్చని కుమారి కుటుంబీకులు వాదిస్తున్నారు. దీంతో అసలు పిల్లిని ఎవరు చంపారనేది తేల్చడం గన్నవరం పోలీసులకు సవాలుగా మారింది.