విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గాయి. అయితే, మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్నది. చాలా జిల్లాల్లో రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయంగా అధికారులు పరిగణిస్తున్నారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 10,310 కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 22,70,491కి చేరుకున్నది. ఇక మరణాల విషయానికొస్తే గత 24 గంటల్లో 11 మంది చనిపోయారు. వీటితో కలిసి మొత్తం మరణాల సంఖ్య 14,606 కు చేరుకున్నది. మరోవైపు, గత 24 గంటల్లో 9,692 మంది నయమయ్యారు. వీరితో కలుపుకుని మొత్తం కోలుకున్న వారి సంఖ్య 21,39,854 కు చేరుకున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,16,031 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.
జిల్లాల వారీ డాటా ప్రకారం.. కడప జిల్లాలో 1,697 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 1,379, గుంటూరులో 1,249, అనంతపురంలో 99 కొత్త కేసులు వచ్చాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 39,296 పరీక్షలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 3.25 కోట్ల కోవిడ్ -19 పరీక్షలను నిర్వహించారు. కరోనాతో కడప, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించగా.. నెల్లూరులో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.