తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Brahmotsavams) తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల మూడో రోజు శుక్రవారం ఉదయం మలయప్పస్వామి సింహ వాహనం ( Simha Vahanam) పై యోగనరసింహుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవకోలాహలంగా జరిగింది.
శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారని , సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతమని అర్చకులు పేర్కొన్నారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, సీవీ ఎస్వో మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.