తిరుపతి : తిరుచానూరు (Tiruchanur) కార్తిక బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా శనివారం మూడో రోజు ఉదయం పద్మావతి అమ్మవారి ముత్యపుపందిరి (Mutyapupandiri) వాహనంపై ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముత్యాలు అలిమేలుమంగకు అత్యంత ప్రీతిపాత్రమైనవని వేద పండితులు తెలిపారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం చేకూరుతుందని విశ్వాసమని పేర్కొన్నారు.
మధ్యాహ్నంశ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుందని వెల్లడించారు. రాత్రి పద్మావతి అమ్మవారు సింహ వాహనంపై భక్తులను కటాక్షించనున్నారని వివరించారు.
వాహనసేవల్లో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో జె శ్యామల రావు, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, భక్తులు పాల్గొన్నారు.