అమరావతి : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్నూలు బస్సు దుర్ఘటనలో మరణించిన వారిలో 19 మంది మృతదేహాలను( Deadbodys) కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్( SP Vikranth Patil) తెలిపారు.గత శుక్రవారం కర్నూలు ( Kurnool ) జిల్లా చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ప్రమాదానికి గురై 19 మంది సజీవదహనం అయిన విషయం సంచలనం రేపింది. ఈ ఘటనలో మరో 27 మంది స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు.
కాగా మూడు రోజుల అనంతరం ఎఫ్ఎస్ఎల్ నివేదికల ఆధారంగా 19 మృతదేహాల్లో 18 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా వారికి అందించారు. మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. మరో గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించి చిత్తూరు నుంచి ఒకరు వచ్చారని వెల్లడించారు. తమ తండ్రి కనిపించడం లేదని ఆ వ్యక్తి చెప్పారని, డీఎన్ఏ నివేదిక ఆధారంగా మృతదేహం ఎవరిదనే విషయం తేలుతుందని అన్నారు. కాగా బైక్ రైడర్ శివశంకర్ మద్యం సేవించినట్లు ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వెల్లడయిందని వివరించారు.