తల్లీపిల్ల కాంగ్రెస్‌లు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగిపోయిందని.. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనంలో రాష్ట్రం రెక్కలు విరిగాయని మండిపడ్డారు. రాజధానిని చెల్లని చెక్కు చేయాలని తల్లి కాంగ్రెస్ చూస్తుంటే.. ఆ పురోగతిని పిల్ల కాంగ్రెస్ అధోఃగతి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేయడమే కాకుండా, ఏపీ పునర్విభజన చట్టాన్ని అస్తవ్యస్తంగా తయారు చేయడం వెనుక జైరాం రమేశ్, పి.చిదంబరం ఉన్నారని లంకా దినకర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును చెల్లని చెక్కు చేద్దామని కాంగ్రెస్ భావించిందని తెలిపారు. కానీ ఆ తప్పును బీజేపీ సవరించి నిధులు ఇస్తుందని తెలిపారు. ఏడు మండలాలను ఏపీలో కలిపి ఇప్పటివరకు 15 కోట్ల రూపాయల నిధులను ఏపీకి మోదీ సర్కార్ ఇచ్చిందని చెప్పారు. దీని ప్రభావం 50 నుంచి 60 వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు.