అమరావతి : ఏపీలో వైసీపీకి (YCP) ఊహించని పరిణామాలు తగులుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నేతలు తమదారితాము చూసుకుంటున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ(Mopidevi Venkata Ramana), బీద మస్తాన్రావు తమ పదవులకు రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్కు అందజేశారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు బుధవారం రాత్రే న్యూఢిల్లీకి చేరుకున్నారు.
రాజీనామాలనంతరం బీద మస్తాన్రావు (Bida Mastan Rao) మాట్లాడుతూ రాజ్యసభ సభ్యత్వాలకు రాజ్యసభ చైర్మన్కు రాజీనామా పత్రాలను అందజేసామని తెలిపారు. తమకు ఇంకా పదవికాలం ఉన్నాగాని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా వ్యక్తిగత కారణాలతో పదవులకు, వైసీపీ పార్టీకి రాజీనామా చేశామని తెలిపారు. తమకు పదవులు కల్పించినందుకుగాను వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు.
రాబోయే రోజుల్లో ఏ పార్టీలో చేరాలన్నది కుటుంబ సభ్యులు, ముఖ్యనాయకులు, అనుచరులతోకలిసి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరెవరినో కలుస్తామని, తాను గతంలో 32 సంవత్సరాల పాటు టీడీపీలో పనిచేశానని, తనకు చంద్రబాబు బాస్లాంటి వారని పేర్కొన్నారు.
ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఎన్నికల తరువాత అందరితో సఖ్యంగా ఉండాలని అన్నారు. భగవంతుడు మళ్లీ అవకాశం ఇస్తే ఢిల్లీకి వస్తానని పేర్కొన్నారు. తాను త్వరలో టీడీపీ (TDP Joinings) చేరనున్నట్లు మోపిదేవి ప్రకటించారు.