Srisailam | శ్రీశైలం : భోగి పండుగ సందర్భంగా శ్రీశైల దేవస్థానంలో సోమవారం సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు వందమంది ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపండ్లు వేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీనివాస్ రావు మాట్లాడుతూ గొబ్బెమ్మలు, గొబ్బి పాటలు, హరిదాసులు, చలిమంటలతో సంక్రాంతి పండుగ తెలుగు సంప్రదాయాలతో ఎంతగానో ముడిపడి ఉందన్నారు. సంక్రాంతి వేడుకలు భోగితో మొదలవుతాయన్నారు. భోగినాడు రోజున చిన్నారులకు భోగిపండ్లు పోయడం సంప్రదాయంగా వస్తుందన్నారు. మహత్తర కార్యక్రమాన్ని భ్రమరాంబ, మల్లికార్జున క్షేత్రంలో జరుపుకుంటున్న చిన్నారులందరూ ఎంతో అదృష్టవంతులని పేర్కొన్నారు. చిన్నారులందరికీ స్వామిఅమ్మవార్ల కృపాకటాక్షాలు ఎల్లవేళలా లభిస్తూ ఉండాలన్నారు.
చిన్నారులకు రేగుపండ్లు పోయడంలో పలు వైజ్ఞానిక అంశాలు కూడా ఇమిడి ఉన్నాయని తెలిపారు. అంతకు ముందు అర్చకులు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు. ఆ తర్వాత గణపతిపూజ నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించారు. చివరగా రేగుపండ్లు, చిన్న చిన్న చెరుకుముక్కలు, పూలరేకులతో కలిపి పిల్లల తలచుట్టూ మూడుసార్లు తిప్పి ఈ భోగిపండ్లను పోశారు. ఈ భోగిపండ్లను వేయడంతో పిల్లలకు పీడలు తొలగి, దృష్టిదోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని పండితులు పేర్కొన్నారు. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని.. భోగిపండ్లను పోయడం వల్ల బ్రహ్మరంధ్రం ప్రేరేపించబడుతుందని, దాంతో మెదడు ఉత్తేజాన్ని పొంది పిల్లల్లో జ్ఞానశక్తి పెరుగుతుందని వివరించారు.