(Adilaxmi Suicide) కాకినాడ: ఆ చిన్నారికి భవిష్యత్‌పై భయమేసింది. తండ్రి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో విరక్తి చెందింది. చివరకు అక్కకు లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు బాల్‌బ్యాడ్మింటన్ యువ క్రీడాకారిణిగా మంచి పేరు సంపాదించారు. వివరాల్లోకెళితే..
యానాంలోని బాలయోగి కాలనీలో దండుప్రోలు ధర్మారావు కుటుంబం నివసిస్తున్నది. ఈయనకు భార్య, ఇద్దరు కూతుర్లు. చిన్నకూతురు ఆదిలక్ష్మి బాల్‌బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణిస్తున్నది. చేపల వ్యాపారం చేసే ధర్మారావు గత కొంతకాలంగా ఖాళీగా ఉంటున్నాడు. దాంతో కుటుంబం ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని ఆదిలక్ష్మి నిత్యం భయపడిపోయేది. చివరకు ఇంట్లోని దేవుడి గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. అక్క ధనకుమారి గమనించి స్థానిక దవాఖానకు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న ఆదిలక్ష్మి.. జనవరిలో జరుగనున్న స్కూల్ గేమ్స్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అక్క ధనకుమారికి వాట్సాప్‌లో మెసేజ్ పంపింది. ‘అక్కా నాకు స్కూల్ గేమ్స్‌కు వెళ్లాలని లేదు. మొన్నటి నుంచి చాలా ఆలోచనలో పడ్డా. మన ఫ్యూచర్ కోసం నానమ్మ, అమ్మలు భయంతో ఉన్నారు. ఓ పక్క నాన్న ఏమీ పట్టించుకోవడం లేదు. భవిష్యత్ ఏమవుతుందోనని భయంగా ఉందక్కా. నా వల్ల కాదు. నన్ను క్షమించు. కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి.. బై అక్కా’ అని వాట్సాప్‌లో మెసేజ్ పంపింది. లేఖ చూసిన వారంతా కుటుంబం కోసం ఎంతగా పరితపించిందోనంటూ కన్నీరు పెట్టుకున్నారు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో 2019, 2020 లలో ఎస్జీఎఫ్ఐ, సబ్ జూనియర్స్ నేషనల్స్‌లో ఆదిలక్ష్మి పాల్గొన్నది.