Putharekulu | ఆత్రేయపురం అంటే గుర్తుకు వచ్చేది పూతరేకులే. భౌగోళిక గుర్తింపుతో ఆత్రేయపురం కీర్తి జాతీయ స్థాయికి చేరింది. తరతరాలుగా వారసత్వ సంపదగా వస్తున్న పూతరేకుల తయారీలో ఈ ఊరికే పూర్తిస్థాయి గుర్తింపు, హక్కులు ఉన్నాయని తేలింది. ఈ నెల 15న విశాఖపట్నం దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆత్రేయపురం పూతరేకులకు గ్లోబల్ ఇండికేషన్ ట్యాగ్ సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నారు. విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలోని ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ విభాగం ఆధ్వర్యంలో లా స్టూడెంట్స్ కృషికి నాలుగు శతాబ్దాల పేద మహిళల నైపుణ్యం, కష్టానికి దక్కిన గుర్తింపు. పూతరేకులకు దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉన్నది.
ఆత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం.. విశాఖపట్నం దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ సహాకారంతో భౌగోళిక గుర్తింపు కోసం గతేడాది డిసెంబర్లో దరఖాస్తు చేసింది. దరఖాస్తును పరిశీలించిన అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 13న విడుదల చేసిన జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ జర్నల్లో ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ప్రకటన జారీ చేసింది. జూన్ 13 అర్ధరాత్రి తర్వాత అభ్యంతరాలకు గడువు ముగియగా.. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో భౌగోళిక స్థానికుల ఎన్నో సంవత్సరాల కష్టానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించినట్లయ్యింది. ఎంతో ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం పూతరేకులుకు అరుదైన గౌరవం దక్కడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందడంపై ఆత్రేయపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.