తిరుమల : తిరుమల (Tirumala) లోని పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాల సందర్భంగా టీటీడీ(TTD) పలు సేవలను రద్దు చేసింది. మే 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో పరిణయోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని అర్చకులు వెల్లడించారు. మూడురోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల తొలిరోజు మలయప్పస్వామివారు గజవాహనం(Gajavahanam), రెండవరోజు అశ్వవాహనం(Asvavahanam), చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారని వివరించారు.
మరోపక్క ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి తీసుకువచ్చిన అనంతరం కల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగామూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం(Arjita Brahmotsavam), సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 19 కంపార్టుమెంట్లలో వేచియున్నారు . టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.08 కోట్లు వచ్చిందని తెలిపారు.