Vizag Steel Plant | అమరావతి : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరించొద్దని విశాఖ ఉక్కు పరిశ్రమ జేఏసీ గత కొన్ని నెలల నుంచి పోరాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) కి చీమ కుట్టినట్లు కూడా కాలేదని ఏపీ యూత్ అండ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ అన్నారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) వైజాగ్ స్టీల్ ప్రయివేటీకరణకు అడ్డుకుంటామని హెచ్చరించడంతో మోదీ దిగివచ్చారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ముందుకు వెళ్లడం లేదంటూ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన ప్రకటనపై ఒంగోలు ప్రెస్ క్లబ్లో ఏపీ యూత్, స్టూడెంట్ జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ మాట్లాడుతూ.. అనేక త్యాగాలతో సాధించుకున్న ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు పరిశ్రమను అదానీకి కట్టబెట్టే కుట్రలను మోదీ ప్రభుత్వం చేసిందని దుయ్యబట్టారు. విభజన హామీలను నేరవేర్చకపోగా, విశాఖ ఉక్కును దొంగలించే ఎత్తులు వేయడం యావత్తు ఏపీ యువత మనసులను గాయపరిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు కుట్రపై రాష్ట్రంలోని అన్ని వర్గాలు పోరాడుతుంటే సీఎం జగన్, చంద్రబాబు మాత్రం మోదీకి మోకరిల్లారని మండిపడ్డారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు కేసీఆర్ రంగంలోకి దిగడంతో మోదీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టాయని పేర్కొన్నారు. బైలదిల్ల గనులను అదానీకి కట్టబెట్టడం, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వెనుక మోదీ పన్నాగాలను కేటీఆర్ బట్టబయలు చేశారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంలో ఇకపై ముందుకు వెళ్లమని కేంద్రం ప్రకటించడం కేసీఆర్ విజయమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మ అయిన విశాఖ ఉక్కు పరిశ్రమకు రక్షణగా నిలిచి,రాష్ట్ర భవిష్యత్‌కు భరోసాను కల్పించిన భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌కు జగదీశ్ ధన్యవాదాలు తెలిపారు.