Deputy CM | నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు చేస్తున్న డిమాండ్‌పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడం సరికాదని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని తెలిపారు. అలాంటప్పుడు లోకేశ్‌కు డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వడమని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కోసం లోకేశ్ ఎంతగానో కష్టపడ్డారని.. అందుకు సముచిత స్థానం ఇచ్చారని తెలిపారు.
గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులు పారిపోయారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కూటమిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. విశాఖ, రాయలసీమ కేంద్రాలుగా పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో ఏపీ, తెలంగాణ ముందుకు వెళ్తున్నాయని అన్నరు. ఉమ్మడి ఆస్తుల విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని చెప్పారు.
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖ కేంద్రంగా విజయసాయిరెడ్డి దోపిడీ చేశారని మండిపడ్డారు. వేల ఎకరాలు, లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి విజయసాయి రెడ్డి అని అన్నారు. ఏ2గా ఉన్న విజయసాయి కేసుల నుంచి తప్పించుకోవడానికే రాజీనామా చేశారని మండిపడ్డారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన ఎవరికైనా సరే శిక్ష తప్పదని హెచ్చరించారు. అధికారం పోయిన తర్వాత పార్టీలో చేరిపోదామనుకుంటే.. చేర్చుకోవడం సరైనది కాదని అన్నారు. విజయసాయిని బీజేపీ చేర్చుకుంటుందని అనుకోవడం లేదని తెలిపారు. వైసీపీ రాబోయే రోజుల్లో కనుమరుగవుతుందని అభిప్రాయపడ్డారు. తొందరలోనే వైసీపీలో అందరూ సర్దుకుంటారని అన్నారు.