అమరావతి : ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) జరిగే అవకాశం ఉండడంతో పొత్తుల ఖరారు, సీట్ల సర్దుబాట్లతో పాటు అధికార పార్టీని ఓడించడానికి వ్యూహరచనలను ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) శనివారం చంద్రబాబు(Chandra Babu)తో సమావేశం కావడం హాట్ టాపిక్‌గా మారింది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ స్వయాన ప్రశాంత్ కిషోర్‌ను తన వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. ప్రశాంత్ కిషోర్ గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విజయానికి వ్యూహ రచన చేసి గెలిపించారు.
ఆనాటి ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయసాధించగా టీడీపీ 23 సీట్లకే పరిమితం అయ్యింది. జనసేన పార్టీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా గెలవలేక పోయాయి. అనంతరం జగన్, కిషోర్ మధ్య దూరం పెరగడంతో ఏపీ రాజకీయాల వైపు పీకే దృష్టిని సారించలేదు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరిగేందుకు అవకాశముండడంతో చంద్రబాబు, పీకే(ప్రశాంత్ కిషోర్) మధ్య భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.