Beaches Closed | ఏపీలోని బాపట్ల జిల్లాలో రెండు బీచ్‌లను పోలీసులు అధికారులు తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో ఈ బీచ్‌లలో మునిగి ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రజలు సముద్ర జలాల్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు మూసివేశారు. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. వారంరోజుల్లో ఆరుగురు వ్యక్తిలో నీటిలో మునిగి చనిపోయారన్నారు. దాంతో వేలపాలెం, చీరాల మండలాల్లోని బీచ్‌ల్లోకి జనం ప్రవేశించకుండా నిషేధం విధించామన్నారు. కొంతమంది మోకాళ్ల లోతు వరకు మాత్రమే వెళ్లినప్పటికీ.. వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ప్రాణాంతకంగా మారుతుందని చెప్పారు. గత వారంలో ఆయా బీచ్‌లలో 14 మందిని రక్షించడం గమనార్హం.
ఈ ఏడాది సముద్రం ఉధృతంగా ఉందని ఎస్పీ చెప్పారు. అయితే, పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉండలేని పరిస్థితి ఉంటుందని.. అందరినీ రక్షించలేకపోవచ్చన్నారు. 76 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉన్న బాపట్ల బీచ్‌లు పర్యాటక ప్రియులను ఆకర్షిస్తుంటాయి. సెలవుల్లో దాదాపు 15వేల మంది వరకు సందర్శించేందుకు వస్తారని ఎస్పీ వివరించారు. ఇదిలా ఉండగా.. వేటపాలం మండలం రామాపురం బీచ్‌లో ఆదివారం ఇద్దరు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు ఆదివారం రామాపురం బీచ్‌కు వెళ్లగా.. స్నానం చేస్తుండగా అలల ఉధృతికి నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరు యువకులూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో పోలీసులు సముద్రంలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. ఈ మేరకు తీరప్రాంతంలో హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు.