AP News : ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు.. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వానికి చెట్లు నరకడం తప్ప, నాటాలనే ఆలోచన రాలేదని అన్నారు. తమది నరికే సంస్కృతి కాదని, నాటే సంస్కృతి అని స్పష్టంచేశారు. హరితాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం మంగళగిరిలోని అరణ్యారామం నందవనంలో నిర్వహించిన ‘అశ్వత్థ నారాయణ వివాహం’ కార్యక్రమంలో నాగబాబు తన అర్ధాంగి పద్మజతో కలిసి పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆయన దంపతులు రావి-వేప మొక్కలను నాటారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యతని గుర్తుచేశారు. అడవుల నరికివేత, విచక్షణారహిత మైనింగ్ వంటి చర్యలతో మనమే భూమాతను గాయపరుస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు తనకు ఒకేరకమైన ఆలోచనలు ఉన్నాయని నాగబాబు తెలిపారు. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉమ్మడి సంకల్పమే తమను ఒకే వేదికపైకి తెచ్చిందని అన్నారు.
భారతీయ సంప్రదాయంలో రావి, వేప చెట్లకు విశిష్ట స్థానం ఉందని, వాటిని కలిపి నాటడం వల్ల జీవవైవిధ్య పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. అనంతరం రూ.24 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ‘అరణ్యారామం’ భవన డిజైన్లను నాగబాబు పరిశీలించారు. ఈ భవన నిర్మాణాన్ని 10 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని పీసీసీఎఫ్ చీఫ్ పీవీ చలపతిరావు ఆయనకు వివరించారు. ఈ నిర్మాణం కోసం తొలగించాల్సి వచ్చిన 73 చెట్లను నరికివేయకుండా.. వేరేచోట విజయవంతంగా పునఃప్రతిష్ఠాపన చేయడంపై ఆయన అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ నాగేశ్వరరావు, డీఎఫ్ఓ హిమశైలజ తదితర అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.