అమరావతి : ఏపీలోని ఐదున్నర కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ మోహన్‌రెడ్డి ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారని ఏపీ మంత్రి అమర్నాథ్ (Minister Amarnath) వెల్లడించారు. మంగళవారం అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి 175 మంది ఎమ్మెల్యేల కన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యమని పేర్కొన్నారు.
బలమైన అభ్యర్థులకు అవకాశమిచ్చి రాష్ట్రంలో మరోసారి గెలుపొందడమే పార్టీ లక్ష్యమని, ఈ లక్ష్యంలో తమకు సీటు వచ్చినా, రాకున్నా బాధ ఉండదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ప్రకటించిన మార్పులను నియోజకవర్గం ఇన్చార్జిలను మాత్రమేనని ఎమ్మెల్యే సీట్లు కాదన్నారు. ఎన్నికల్లో బీఫాం ఇస్తేనే సీట్లు ప్రకటించినట్టు గుర్తించుకోవాలని సూచించారు.
2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి : మంత్రి పెద్దిరెడ్డి
2019లో కంటే 2024లో జరుగబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. సీఎం జగన్ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబుకు ఓటమి భయంతో ప్రశాంత్ కిషోర్‌తో స్నేహం చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీలో టికెట్లు రానివారిని చేరదీస్తూ సంబరపడుతున్నాడని విమర్శించారు. తమ పార్టీలో గెలువని వ్యక్తి ఇతర పార్టీలో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు.