విశాఖపట్నం: శారదాపీఠం ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి అప్పలరాజుకు చుక్కెదురైంది. అనుచరులతో కలిసి వచ్చిన అప్పలరాజును ఒక్కరినే శారదాపీఠం ఆవరణలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అప్పలరాజుతోపాటు ఆయన అనుచరులు, వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఎం జగన్ ఉత్సవాలకు హాజరవుతున్నందున పోలీసులు.. పీఠం ఆవరణలోకి వెళ్లేందుకు పాసులున్న వారినే అనుమతిస్తున్నారు.
విశాఖ శారదాపీఠం ఉత్సవాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయనను స్వాగతించేందుకు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి ఎస్ అప్పలరాజు ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం తన అనుచరులు, కొందరు వైసీపీ నేతలతో కలిసి శారదాపీఠంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి అప్పలరాజు ఒక్కరినే లోనికి వెళ్లేందుకు అనుమతించడంతో పోలీసులు, మంత్రి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
ముఖ్యమంత్రి వస్తున్నందున తాను వేదిక వద్దకు వచ్చానని అప్పలరాజు చెప్పినప్పటికీ పోలీసు వినిపించుకోలేదు. మరోవైపు మంత్రి అనుచరులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రి అనుచరులను పీఠంలోకి రాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో మంత్రి అప్పలరాజు పీఠం ఉత్సవాలకు హాజరుకాకుండానే వెళ్లిపోయారు. దాంతో కొద్దిసేపు అక్కడ ఏంజరుగుతుందో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పాసులు ఉన్నవారినే అనుమతిస్తున్నామని, అంతకుమించి తామేమీ మంత్రిని అనలేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.